Hot Posts

6/recent/ticker-posts

ఏలూరులో సమాచార హక్కు చట్టంపై జిల్లా స్థాయి అవగాహనా సదస్సు


ఏలూరు, డిసెంబర్ 15 : ప్రజాస్వామ్యంలో పౌరుడికి అత్యంత శక్తివంతమైన సాధనంగా పేరుగాంచిన సమాచార హక్కు చట్టం (RTI)–2005 అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఏలూరు జిల్లా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా ఖజానా కార్యాలయంలో జిల్లా స్థాయిలో విస్తృత అవగాహనా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడినట్లు జిల్లా ఖజానా మరియు లెక్కల శాఖాధికారి ఎన్. శ్రీనివాసులు తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాఖలోని అధికారులు మరియు ఉద్యోగులకు ఆర్‌టీఐ చట్టం అమలుపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్‌టీఐ దరఖాస్తులకు నిర్ణీత గడువులోగా సమాధానాలు ఇవ్వకపోతే లేదా నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని, గరిష్టంగా రూ.25,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

పౌర సమాచార అధికారులు (PIOలు) మరియు సహాయ పౌర సమాచార అధికారులు (APIOలు) తమ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ, అవసరమైన సమాచార సేకరణ మరియు దరఖాస్తుదారులకు నిర్ణీత కాలంలో సమాచారాన్ని అందించే ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

అలాగే చట్టంలోని సెక్షన్ 4(1)(b) ప్రకారం, శాఖకు సంబంధించిన ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు, పెన్షన్ల మంజూరు, బడ్జెట్ కేటాయింపులు వంటి సమాచారాన్ని దరఖాస్తు అవసరం లేకుండానే ముందస్తుగా (సుమోటో డిస్‌క్లోజర్) వెబ్‌సైట్‌లో పారదర్శకంగా ప్రచురించాలని ఆదేశించారు. ఈ అవగాహనా కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత పెంచే దిశగా ఇది కీలక ముందడుగుగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఖజానా కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.