ANDRAPRADESH: తూర్పు గోదావరి జిల్లాలోని తుని రైలు దహనం ఘటనపై రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తున్న ట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఈ ఉత్తర్వులపై కాపు సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్టు తెలిసింది. దీంతో వెంటనే సదరు ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్నట్టు ప్రకటించింది. ఆ వెంటనే మరో జీవోను జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు, ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొంది.(వాస్తవానికి ఈ ఉత్తర్వులు ఇచ్చింది.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి).
``తుని రైలు దుర్ఘటన అంశంపై రైల్వే కోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఉద్దేశ పూర్వకంగా ఈ ఘటన జరిగింది కాదని.. పేర్కొంది. ఈ కేసును మూసేసి కూడా రెండేళ్లు అయింది. ఇప్పుడు ఈ కేసును తిరగ దోడాలని ప్రభుత్వం భావించడం లేదు. అయితే.. దీనికి సంబంధించిన జీవోను సర్కారు విడుదల చేసిన మాట వాస్తవమే. కానీ.. ప్రభుత్వ పెద్దల దృష్టికి రాకుండా.. కొందరు అధికారులు అత్యుత్సాహంతో ఈ కేసును తిరగదోడాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీంతో వెంటనే జీవో ఇచ్చారు. దీనిని రద్దు చేస్తున్నాం``. అని తాజాగా జీవోలో ప్రభుత్వం ప్రకటించింది.
తాజాగా ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం వెనుక రెండు వైపుల నుంచి ఒత్తిడి వచ్చినట్టు తెలుస్తోంది. 1) తుని రైలు ఘటనలో ప్రమేయం ఉందని భావిస్తున్న కాపు సామాజిక వర్గం నుంచి. 2) దీనిని దురుద్దేశ పూరితంగా తిరగదోడుతున్నారన్న వాదన వినిపించడం. ఈ రెండు కారణాలతోనే జీవో ఇచ్చిన 10 గంటల్లోనే దీనిని వెనక్కి తీసుకున్నారు. ఇక, ఈ వ్యవహారం రాజకీయంగా సర్కారుకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే.. జీవోను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని పరిశీలకులు చెబుతున్నారు.