ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి, 22: జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇలవేల్పు దేవతగా పూజలందుకుంటున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి 62వ వార్షిక ఉగాది జాతర మహోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. మహా పూర్ణాహుతి, భారీ అన్నసమారాధనతో జాతర సంపూర్ణత సాధించింది.
ఉదయం ఆలయ యాగశాలలో ప్రత్యేక హోమాలు, మూలమంత్ర హోమం, విశ్వశాంతి కోసం మహా పూర్ణాహుతి కార్యక్రమాలు ప్రధానార్చకులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు) పర్యవేక్షణలో ఏర్పాట్లు జరిగాయి.
తదుపరి అమ్మవారికి పిండివంటలు, మధురపదార్థాలతో కుంభాన్న నివేదన నిర్వహించి భక్తులకు మహా అన్నసమారాధన చేపట్టారు. సుమారు పది వేల మందికి అన్నప్రసాదం పంపిణీ చేయడం విశేషం. కళ్యాణ వేదిక వద్ద భగవద్గీత పారాయణం, భజన కోలాటం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ, సేవా బృందాలు సమన్వయంతో పనిచేశాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.








