తాజా వార్తలు

10/recent/ticker-posts

వడ్డీతో కలిపి మరీ...జగన్ మాస్ వార్నింగ్


తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నింటి మీద పూర్తి స్థాయిలో విచారణ ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.


ఆంధ్ర ప్రదేశ్,అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేది కేవలం మూడేళ్ళు మాత్రమే అని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 2029లో వచ్చేది తమ ప్రభుత్వం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే వైసీపీ చేస్తున్న ఈ దాడులకు అక్రమ అరెస్టులకు వడ్డీలతో కలిపి నాలుగింతలు తిరిగి ఇస్తామని ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతల మీద దాడులు చేస్తే భయపడిపోతారు అనుకుంటే అది తప్పు అని ఆయన అన్నారు. వైసీపీ కార్యకర్తల విషయంలో అలా ఎపుడూ అనుకోవద్దని సూచించారు. బంతిని గట్టిగా కొడితే అంతకు రెట్టింపు వేగంతో తిరిగి వస్తుందని గుర్తుంచుకోవాలని హెచ్చ్చరించారు. 

గంటల తరబడి : వైసీపీ అధినేత తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి ర్యాలీగా వచ్చారు. దారిపొడవునా జనాలతో గంటల తరబడి జగన్ ప్రయాణం సాగింది. అనంతరం అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి ఆయన సతీమణి, కుమార్తెలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా అంబటి నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన జగన్ కూటమి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

వైసీపీ నాయకులు ఏమి తప్పు చేశారని వేధిస్తున్నారు అని జగన్ ప్రశ్నించారు. మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్ ఇళ్ళ మీద దాడులు చేశారు, అలాగే మాజీ మంత్రి విడదల రజనీ మీద దాడి చేశారు మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మీద మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మీద మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద దాడులు చేశారని ఆయన మండి పడ్డారు. అసలు ఎందుకు ఈ దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు అని జగన్ ప్రశ్నించారు. 

హత్య చేస్తారా : అంబటి రాంబాబు ఆవేశంతో తిట్టానని చెప్పారని ఆయన విచారం వ్యక్తం చేశారని అయినా సరే ఆయన ఇంటి మీదకు వచ్చి గంటల తరబడి దాడులు చేశారని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి నాయకత్వంలో ఇదంతా జరిగిందని జగన్ ఆరోపించారు. అంబటిని హత్య చేయాలని చూశారని జగన్ తీవ్ర విమర్శలు చేశారు. 

జంగిల్ రాజ్ అంటూ : బీహార్ లో ఏమి జరుగుతుందో తెలియదు కానీ ఏపీలో మాత్రం జంగిల్ రాజ్ నడుస్తోందని ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అవుతోందని ఆయన అన్నారు. రెండేళ్ళు కాలం అయిపోయింది. ఇక మిగిలింది మూడేళ్ళే. ఆ తరువాత ప్రభుత్వం మారుతుందని అని ఆయన అన్నారు. 

పూర్తి స్థాయిలో విచారణ : తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నింటి మీద పూర్తి స్థాయిలో విచారణ ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. ఈ విషయం చంద్రబాబు లోకేష్ సహా అందరికీ చెబుతున్నామని ఆయన పేర్కొన్నారు అలాగే పోలీస్ వ్యవస్థకు కూడా సూచిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో ఊరుకునే ప్రసక్తి లేదని జగన్ హెచ్చరించారు. 

రాష్ట్ర బంద్ కి సైతం : రాష్ట్ర బంద్ కి కూడా పిలుపు ఇస్తామని జగన్ చెప్పారు. ఈ అరాచకాల మీద పోరాడుతామని ఆయన అన్నారు. తమ పార్టీ వారంతా కలసి కూటమి ప్రభుత్వాన్ని ఓడిస్తారని జగన్ స్పష్టం చేశారు. మొత్తం మీద జగన్ మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తూ కూటమి నేతల మీద నిప్పులు చెరిగారు. మరి దీనికి కూటమి నుంచి రీయాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.