Hot Posts

6/recent/ticker-posts

ఏలూరులో ఘనంగా ఇంధన పొదుపు అవగాహన ర్యాలీ


 ఏలూరు, డిసెంబర్ 15 : జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు డిసెంబర్ 14 నుండి 20 వరకు నిర్వహించబడుతున్న నేపథ్యంలో, సోమవారం ఉదయం ఏలూరు నగరంలో ఇంధన పొదుపుపై అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీ ఏలూరు కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమై ఫైర్ స్టేషన్ మీదుగా విద్యుత్ భవన్ వరకు కొనసాగింది.


ఈ ర్యాలీని గౌరవ ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మ రాజు మరియు ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ర్యాలీలో పాల్గొని, ఫైర్ స్టేషన్ కూడలిలో అందరితో ఇంధన పరిరక్షణ మరియు సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మరియు జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ మాట్లాడుతూ, విద్యుత్ ఆదా చేయడం అనేది కొత్తగా విద్యుత్ ఉత్పత్తి చేసినట్లేనని పేర్కొన్నారు. సాంప్రదాయ ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించి, ఇంధన పొదుపుపై అన్ని వర్గాల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లాలో డిసెంబర్ 14 నుండి 20 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు.

స్టార్ రేటింగ్ ఉన్న ఎల్‌ఈడీ బల్బులు, నాణ్యమైన విద్యుత్ పరికరాల వినియోగం ద్వారా విద్యుత్ పొదుపు సాధ్యమవుతుందని, ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వారు అన్నారు. ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆదా చేసే అలవాట్లు అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ ఇంధన పొదుపు అవగాహన ర్యాలీలో విద్యుత్ పర్యవేక్షక ఇంజనీర్ పి. సాల్మన్ రాజ్, ఆర్డీవో అచ్యుత్ అంబరీష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్) కె.ఎం. అంబేద్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజీనీర్లు టి. శశిధర్, కె. శ్రీనివాసరావు, డి. ఆదినారాయణతో పాటు విద్యుత్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.