Hot Posts

6/recent/ticker-posts

కోదండరాం, ప్రియాంక గాంధీలకు కూడా ఉద్యోగాలు వచ్చాయి: హరీశ్ రావు


కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్న హరీశ్ రావు

జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చి 'దగా క్యాలెండర్' అమలు చేస్తున్నారని విమర్శ

నిరుద్యోగుల 'ఛలో సచివాలయం'కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు

2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని స్పష్టీకరణ

తమ పాలనలో 1.62 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేసిన హరీశ్ రావు

అసెంబ్లీలోనూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని వెల్లడి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, కానీ కోదండరాం, ఆకునూరి మురళి, ప్రియాంక గాంధీలకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను తీవ్రంగా మోసం చేస్తోందని, హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌కు బదులుగా 'దగా క్యాలెండర్'ను అమలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

నిరుద్యోగ యువత తలపెట్టిన 'ఛలో సచివాలయం' కార్యక్రమానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు. ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఎన్నికల ముందు ఎన్నో ఆశలు కల్పించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తాయని యువత ఎంతో నమ్మింది. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా యువతను మోసం చేశారు. నోటిఫికేషన్లు వద్దంటూ యువతే ధర్నాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేయడం దారుణం" అని ఆయన మండిపడ్డారు. తమ బీఆర్ఎస్ పాలనలో 1.62 లక్షల ఉద్యోగాలు కల్పించామని ఈ సందర్భంగా హరీశ్ గుర్తు చేశారు.

ప్రియాంక గాంధీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. "ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిరంతరం వెంటపడి ఆ హామీని నెరవేర్చేలా ఒత్తిడి తెస్తాం" అని ఆయన తేల్చిచెప్పారు. ఈ అంశంపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వ జాప్యాన్ని కూడా హరీశ్ రావు తప్పుబట్టారు. "ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేస్తే ఎలాంటి కమిషన్లు రావనే ఉద్దేశంతోనే వాటిని నిలిపివేశారా?" అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని, వారి హక్కుల సాధనలో ముందుంటుందని భరోసా ఇచ్చారు.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now