Hot Posts

6/recent/ticker-posts

సప్త సముద్రాలు దాటి వెళ్లినా ఎవ్వరినీ వదలిపెట్టం.. వైఎస్ జగన్ మాస్ వార్నింగ్


ANDRAPRADESH: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలను అధికారులు, పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తాజాగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం.. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ.. పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్లు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలతో వైఎస్ జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారిని ఎవ్వరినీ వదలమని హెచ్చరించారు.


రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు పడుతున్న బాధలు చూస్తున్నానని.. ఈ సందర్భంగా తాను హామీ ఇస్తున్నానని వైఎస్ జగన్ తెలిపారు. కేవలం వైసీపీని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశానని.. అందుకే జగన్‌ 2.0 లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని వెల్లడించారు. ఎవ్వరినీ వదలం.. ఎక్కడున్నా వదలమని తేల్చి చెప్పారు. కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోవాలని ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులకు జగన్ సూచించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని చట్టం ముందు నిలబెడదామని పేర్కొన్నారు.

ఇవాళ ప్రభుత్వం, పోలీసులు చేస్తున్న దుర్మార్గం.. వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుందని జగన్ తెలిపారు. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడ ఉన్నా.. ఒకవేళ రిటైర్‌ అయినా.. ఇంకా సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. అప్పుడు మామూలుగా ఉండదని మాస్ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రశ్నించకూడదని నిరంకుశత్వం, డైవర్షన్‌.. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు, సంబంధం లేని కేసుల్లో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ప్రజల్లో చులకన అయ్యారు కాబట్టే చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు.

ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని.. దీంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని జగన్ తెలిపారు. ఎవరూ ప్రశ్నించకూడదని, రాష్ట్రంలో భయానక పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా.. వెంటనే వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఒకరోజు తిరుపతి లడ్డూ అని.. ఇంకోరోజు సినీ నటి కేసు అని.. ప్రజలను ఏమార్చుతున్నారని మండిపడ్డారు. కూటమి నేతలకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదని.. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేరని అన్నారు. విద్యార్థులు, రైతులు, యువత, పింఛన్‌దారులు తమ డబ్బులు ఏమయ్యాయని అడుగుతారని.. ఎన్నికల ముందు మాట ఇచ్చి, ఇప్పుడు మోసం చేయడంతో సమాధానం చెప్పలేని దుస్థితి వచ్చిందని వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now