వ్యవసాయ, ఉధ్యాన తదితర శాఖల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలపై రైతులకు అవగాహన..
కొల్లేరు ప్రజల విషయంలో మానవతా ధృక్పధంతో చూడాలి..
సమీక్షా సమావేశంలో ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్..
సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి..
ఏలూరు: దెందులూరు నియోజకవర్గ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లు అధికారులకు దిశా, నిర్ధేశం చేశారు. గురువారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో నిర్వహించిన దెందులూరు నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వ్యవసాయ, ఉధ్యాన, ఇరిగేషన్, పశుసంవర్ధక శాఖ, పిఆర్, ఆర్ అండ్ బి, విద్యుత్, రెవిన్యూ, తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సుధీర్ఘ సమీక్ష జరిగింది. ఈ సందర్బంగా ఎంపి పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గ అభివృద్ధిపై లేవనెత్తిన పలు అంశాలపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పందిస్తూ అందుకు సంబంధించిన పరిష్కార చర్యలకు సంబంధిత అధికారులకు దిశా నిర్ధేశం చేశారు.
ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఎంపి ల్యాడ్స్ కు సంబంధించి 2014-19 చేపట్టిన పనులకు సంబంధించిన వివరాలు, 2019-24 సంబంధించిన పనులు వివరాలు పై సమీక్షిస్తూ పనులు చేపట్టి అసంపూర్తిగా మిగిలిన పనులను చేపట్టేందుకు ప్రతిపాధనలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొల్లేరు రైతులు విషయంలో మానవతా ధృక్పధంతో అటవీశాఖ అధికారులు వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రజలు ఇబ్బంది పడే ఏచర్యలను చేపట్టవద్దని సూచించారు. కొల్లేరుకు సంబంధించి ఏవైనా సమస్యలు వుంటే తమ దృష్టికి తీసుకురావాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. దెందులూరు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా తనవంతు పూర్తి సహకారం అందిస్తానన్నారు.
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో నియోజవర్గ అభివృద్ధికి అధికారులంతా సమన్వయంతో పని
చేయాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాలకు తోడు మరిన్ని అభివృద్ధి పనులు జరగాలన్నదే తన లక్ష్యమన్నారు. జనుము, జీలుగ విత్తనాలు సరఫరాను ఎక్కువ మొత్తంలో చేపట్టి సంబంధిత వివరాలు రైతు సేవాకేంద్రాల్లో ప్రదర్శించాలన్నారు. ఆయిల్ ఫామ్ పంట ప్రోత్సహించేందుకు మొక్కలు, ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్, తదితర సౌకర్యాలు కల్పిస్తే దెందులూరు , పెదవేగి మండలాల్లో 90 శాతం మంది రైతులు ఆయిల్ పామ్ పంట వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఆయిల్ ఫామ్ పంట ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను కరపత్రాల ద్వారా అవగాహన పర్చాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించేందుకు నియోజకవర్గం నాలుగు మండలాల్లో 5 వేల ఎకరాల చొప్పున డెమో ప్లాట్లు వేసేందుకు భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ దిశగా ఒక మోడల్ గా ప్రకృతి వ్యవసాయాన్ని దెందులూరు నియోజకవర్గంలో తీసుకురావాలని సూచించారు. మత్స్యశాఖకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చే పధకాలపై విస్త్రృతంగా అవగాహన పరచాలన్నారు. కొత్త సొసైటీలు ఏర్పాటుచేసి ఎస్సీ, ఎస్టీలకు చెరువులు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటే వారికి ఉపాధి కల్పించినట్లు అవుతుందన్నారు.
పెదవేగి మండలంలో దుగ్గిరాల, వంగూరు, దొండపాడు, పినకడిమి, జానంపేట, తదితర గ్రామాల్లో సుమారు 23 ఎకరాలు ఇరిగేషన్ స్ధలం ఖాళీగా ఉందని, అందుకు సంబంధించి ఎన్ఓసి సంబంధిత శాఖ ఇస్తే సిసిఎల్ఎ కు ప్రతిపాధనలు పంపి ఇళ్ల స్ధలాలకు అవసరమైన భూమిని సమకూర్చే అవకాశం ఉందన్నారు. ఈ దిశగా అధికారులు దృష్టి పెట్టాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో మార్గంలేని స్మశానవాటికలకు స్ధలం గుర్తించి జాబితాలను సిద్ధం చేయాలని సూచించారు. గుండుగొలను నుంచి ఏలూరు గోదావరి కాలువ చివరి వరకు కొంతమేర పూడికతీసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
చినుకులు పడుతుండటంతో రైతులు ఆంధోళన చెందుతున్నారని, ధాన్యం కాపాడుకునేందుకు అన్ని రైతు సేవాకేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. పంచాయితీరాజ్ పరిధిలో చేపట్టి అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, వివో, జిపి తదితర పనుల తీరునివేదికను అందజేయాలని కోరారు. బి.సి. కార్పోరేషన్ ద్వారా లబ్దిదారులకు అందించవలసిన వివిధ ఉపకరణాల విషయంపై తీసుకున్న చర్యలను విచారణ చేయాలని సూచించారు. ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ రోడ్లపై ఆక్రమణలు తొలగించిన చోట వెంటనే విద్యుత్ స్ధంబాలు ఏర్పాటు చేయాలన్నారు.
పెదపాడు సబ్ స్టేషన్ సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. రొయ్యిలు, చేపల చెరువులకు విద్యుత్ బిల్లుల విషయంలో ఇబ్బంది పెట్టకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న ఇళ్ల స్ధలాల లేఅవుట్ లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కానివి, ప్రారంభమైనవి లబ్దిదారుల జాబితాలు తయారుచేసి గ్రామ పంచాయితీల్లో ప్రదర్శించాలని సూచించారు. 2014-19 మధ్య ఇళ్లు మంజూరై పేమెంట్ జరగని ఇళ్లకు సంబంధించి నిధులు చెల్పింపుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ, ఉధ్యాన, తదితర శాఖల ద్వారా అమలవుతున్న ఆయా పధకాల వివరాలను ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో జనుము, జీలుగ గ్రీన్ మెన్యురే సంబంధించి 10 వేల మెట్రిక్ టన్నులు కేటాయించగా ఇప్పటికే 4వేల మెట్రిక్ టన్నులు జిల్లాకు అందాయని మిగిలినవి కూడా వారం రోజుల లోపు రానున్నాయన్నారు. దెందులూరు నియోజకవర్గంలో 1800 హెక్టార్లలో ఉధ్యాన పంటల విస్తరణకు లక్ష్యం నిర్ద్ధేశించడంజరిగిందన్నారు. ఆయిల్ ఫామ్ పంట విస్తీరణకు రైతుల్లో అవగాహన కలిగించేందుకు వర్క షాప్ నిర్వహించాలని ఉధ్యాన, ఎపిఎంఐపి, డ్వామా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించేందుకు జిల్లాలో చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో గౌ. ప్ర్రజా ప్రతినిధులు లేవనెత్తిన వివిధ అంశాలపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత్ అంబరీష్, సిపివో వాసుదేవరావు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, జెడ్పి సిఇఓ కె. భీమేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్ భాషా, పశుసంవర్ధకశాఖ జెడి గోవిందరాజులు, ఎపిఎంఐపి పిడి రవికుమార్, జిల్లా గృహనిర్మాణశాఖ అధికారి సత్యనారాయణ, డ్వామా పిడి కె.వి. సుబ్బారావు, ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ పి. సాల్మన్ రాజు, డిఇఓ యం. వెంకటలక్ష్మమ్మ, పరిశ్రమలకేంద్రం జిల్లా మేనేజరు సుబ్రహ్మణ్యేశ్వరరావు, డిసివో శ్రీనివాస్, పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు శివరామమూర్తి, బి.సి. కార్పోరేషన్ ఇడి ఎన్. పుష్పలత, ఎస్సీ కార్పోరేషన్ ఇడి ఎం. ముక్కంటి, ఆర్ అండ్ బి , పంచాయితీ రాజ్, ఇరిగేషన్ అధికారులతోపాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల తహశీల్దార్లు, యంపిడివోలు తదితరులు పాల్గొన్నారు.