ANDRAPRADESH, RAJAMPETA: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. రాజంపేట, మడకశిర మున్సిపాలిటీలతో పాటు రామకుప్పం, రొద్దం మండలాల నేతలతో సమావేశమైన ఆయన, ఇటీవల జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పాల్పడిన అక్రమాలను తీవ్రంగా ఖండించారు. ఈ దాడులను ఎదుర్కొని నిలబడిన పార్టీ నేతలు, కార్యకర్తలను అభినందించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. "ఈ పరిస్థితుల మధ్య తులసి మొక్కల్లా.. తెగువ చూపించి, విలువలతో కూడిన రాజకీయాలకు అర్ధం చెప్పి.. వాటిని చంద్రబాబుకు చూపారు.. నిలబడిన మీ అందరికీ హ్యాట్సాఫ్" అని కొనియాడారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అత్యంత ఆవశ్యకమని, అయితే చంద్రబాబు వాటన్నింటినీ దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
-స్థానిక సంస్థల్లో చంద్రబాబు అనైతిక చర్యలు:
రామకుప్పంలో ఒక ఎంపీటీసీ మరణిస్తే జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీకి 16 మంది సభ్యులున్నా, చంద్రబాబు తమ అభ్యర్థిని నిలబెట్టి ఆరుగురిని లాక్కునే ప్రయత్నం చేయడమే కాకుండా, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీల వాహనాలను పోలీసుల ద్వారా అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. కోరం లేకపోయినా ఏకపక్షంగా డిక్లేర్ చేసుకున్నారని మండిపడ్డారు. రొద్దం మండలంలో కూడా ఇదే విధంగా దిగజారిన రాజకీయాలకు పాల్పడ్డారని, చెడిపోయిన రాజకీయాలకు చంద్రబాబు దిక్సూచిలా మారారని విమర్శించారు. మడకశిర ఎస్సీ నియోజకవర్గంలోనూ, అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలోనూ వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి లాక్కోవడానికి చంద్రబాబు విశ్వప్రయత్నం చేశారని ఆరోపించారు.
చంద్రబాబు సిగ్గుపడాలి:
వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఏ నాయకుడైనా ఆదర్శంగా ఉండాలని, అయితే చంద్రబాబు చర్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు విలువలు, విశ్వసనీయతతో పని చేస్తున్నారని, వారిని చూసి చంద్రబాబు సిగ్గుపడి తల దించుకోవాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మాట తప్పకుండా, సంక్షేమ పథకాలను అమలు చేశామని, బటన్ నొక్కామని గుర్తు చేశారు. అందుకే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించిందని తెలిపారు.
-మీ బాధలు చూస్తున్నాను.. హామీ ఇస్తున్నా..
వైఎస్సార్‌సీపీని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను తాను చూశానని, అందుకే 'జగన్ 2.0'లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోవాలని, అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు రిటైర్ అయినా, ఎక్కడ ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో సంబంధం లేని వారిని ఇరికిస్తున్నారని, ఇలాంటి రాజకీయాలు గతంలో ఎప్పుడూ చూడలేదని జగన్ అన్నారు.
చంద్రబాబు ప్రజల్లో చులకన అయ్యారని, హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, అందుకే ఎవరూ ప్రశ్నించకుండా రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఎదురుతిరిగినప్పుడు, సమస్యలు తలెత్తినప్పుడు తిరుపతి లడ్డూ, సినీ నటి కేసు వంటి అంశాలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
- అన్ని వ్యవస్థలు నాశనం చేసేశారు..
ప్రస్తుత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని జగన్ మండిపడ్డారు. నాడు-నేడు, ఇంగ్లిష్ మీడియం, ట్యాబ్‌ల పంపిణీ, గోరుముద్ద వంటి పథకాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలను పక్కాగా అమలు చేసిన తమ ప్రభుత్వం ఏటా రూ.3900 కోట్లు ఖర్చు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం నామమాత్రంగానే నిధులు విడుదల చేసిందని, దీంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని, ఆరోగ్య ఆసరా ఇవ్వడం లేదని, దీంతో పేదలు వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోందని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ఆర్బీకేలు నీరుగారిపోయాయని, ఉచిత పంటల బీమా లేదని విమర్శించారు. గతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుందని, పెట్టుబడి సాయంగా రూ.13,500 ఇచ్చామని, అయితే రూ.26 వేలు ఇస్తానన్న చంద్రబాబు రైతులను మోసం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా రాజ్యమేలుతోందని జగన్ ఆరోపించారు.
యూనిట్ విద్యుత్‌ను రూ.2.49కి కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న తమ ప్రభుత్వం కాకుండా, ఇప్పుడు రూ.4.60కి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ఊరూపేరు లేని కంపెనీలకు తక్కువ ధరకే వేల కోట్ల విలువైన భూములను కేటాయించారని ఆరోపించారు. మద్యం ఏరులై పారుతోందని, ఊరూరా బెల్టుషాపులు, డోర్ డెలివరీలు జరుగుతున్నాయని, ఎక్కువ ధరకు అమ్ముతున్నారని అన్నారు. ఉచిత ఇసుక పేరుకేనని, బ్లాక్‌లో అధిక ధరకు అమ్ముకుంటున్నారని, మైనింగ్ చేయాలన్నా ఎమ్మెల్యేలకు కప్పం కట్టాల్సిందేనని ఆరోపించారు.
- బాండ్ల పేరుతో కొత్త అవినీతి:
ఇంత పచ్చిగా అవినీతి చేస్తూ, దానిని గత ప్రభుత్వంపై నెడుతున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జగన్ అన్నారు. ఎల్లో మీడియా దీనికి వంత పాడుతోందని విమర్శించారు. ఏపీ ఎండీసీలో బాండ్ల పేరుతో కొత్త అవినీతికి పాల్పడుతున్నారని, నచ్చిన వారికి గనులను అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అవినీతి ఇంతవరకు చూడలేదని అన్నారు.
మళ్లీ వచ్చేది మనమే:
చూస్తుండగానే ఏడాది గడిచిందని, గట్టిగా నిలబడి మూడేళ్లు పోరాడితే, ఆ తర్వాత కచ్చితంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు వేధిస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోమని, అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడతామని మరోసారి స్పష్టం చేశారు.