రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో ఏపీ బీజేపీలో అయోమయం పెరిగిపోతోంది. తమ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమో టీడీపీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. తమ రెండు పార్టీలు కలిసి రాబోయే ఎన్నికల్లో పాల్గొంటాయని చెప్పేశారు. వైసీపీకి వ్యతిరేకంగా చేయాల్సిన పోరాటాల కోసం ఉమ్మడి కార్యాచరణ కూడా రెడీ అవుతోంది. ఇందుకోసం రెండుపార్టీల్లోను సమన్వయ కమిటిలు కూడా రెడీ అవుతున్నాయి. జనసేనలో నాదెండ్ల మనోహర్ నాయకత్వంలో ఆరుగురు నేతల పేర్లను పవన్ ప్రకటించేశారు.
టీడీపీ తరపున మాజీమంత్రి యనమల రామకృష్ణుడు నాయకత్వం వహించబోయే కమిటిలో ఎవరెవరు ఉంటారన్నది తేలాలి. టీడీపీ నుండి ఆరుగురు నేతలు ఫైనల్ అయితే సమన్వయ కమిటి భేటీకి తేదీ ఫిక్సవ్వాలంతే. ఈ సమన్వయకమిటి ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలన్నీ నిర్ణయమైపోతాయి. రెండుపార్టీల మధ్య జరుగుతున్న వ్యవహారాలను ఏపీ బీజేపీ కళ్ళప్పగించి చూస్తున్నదంతే. మిత్రపక్షమైన జనసేనను కంట్రోల్ చేయలేక అలాగని తాము కూడా కలిసి ముందుకు వెళ్ళలేక అవస్తలు పడుతోంది.
టీడీపీ, జనసేనతో కలిసి తాము కూడా ముందుకు వెళ్ళాలా ? లేకపోతే ఆ పార్టీలతో విభేదించాలా అన్నది కమలనాదులకు అర్ధంకావటంలేదు. రాష్ట్రంలో పరిణామాలను కేంద్ర నాయకత్వానికి రిపోర్టుచేసినా అక్కడి నుండి ఎలాంటి డైరెక్షన్ రాలేదు. దాంతో ఏమిచేయాలో తెలీక నేతలంతా ఫుల్లు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ అయోమయం తేలకుండా పార్టీపరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోలేక పోతున్నారు బీజేపీ నేతలు.
అయితే జనసేనతో సంబంధంలేకుండా పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళమని మాత్రమే డైరక్షన్ వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపణలు, విమర్శతోనే సరిపెడుతున్నారు. అంతేకానీ గ్రౌండ్ లెవల్లో ఎలాంటి యాక్షన్ లోకి దిగటంలేదు. పార్టీ పరంగా ఆందోళన కార్యక్రమాలను చేయమని కానీ వద్దని కేంద్రం పెద్దలు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. గతంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసినపుడు అభ్యంతరాలు చెప్పలేదు. అయితే జనసేనతో కలిసి వెళ్ళే విషయంలోనే ఎలాంటి డైరెక్షన్ రాలేదు. మరి ఈ విషయంలో కేంద్రం పెద్దల మనసులో ఏముందో ఎవరికీ అర్ధంకావటంలేదు.