టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, జైలు దరిమిలా.. ఒకింత ఆవేదనలో కూరుకుపోయిన ఆ పార్టీ ఇప్పుడు పుంజుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. త్వరలోనే జనంలోకి టీడీపీ నినాదంతో పార్టీ కీలక నాయకులు ప్రజల్లోకి వెళ్లనున్నారు. టీడీపీ అధినేత అక్రమ అరెస్టు, అరాచక పాలన వంటి వాటిని ప్రజలకు వివరించేలా ఈ కార్యక్రమాలు ఉండనున్నాయి. దీనికి సంబంధించి టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తాజాగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుతం చంద్రబాబుకి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోను, విదేశాల్లో కూడా ఉద్యమాలు జరుగుతున్నాయని నారా లోకేష్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని మరోసారి నిరూపించారని అన్నారు. అయితే.. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందనినారా లోకేష్ వెల్లడించారు. చంద్రబాబు అరెస్టుతో తీవ్ర ఆందోళనకి గురై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనతో 157 మంది చనిపోయారని, ఆ కుటుంబాలకు మనం అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
టీడీపీ అధినేత అక్రమ అరెస్టుపై అనేక సందేహాలు ప్రజల్లో ఉన్నాయని, వాటినివివరించేందుకు కార్యకర్తలు సైతం ప్రజల్లోకి వెళ్లాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. అదేసమయంలో ఒక్క ఛాన్స్ ఇస్తే మీ జీవితాలు మార్చేస్తా అంటే ప్రజలు 151 సీట్లు ఇచ్చారని, 151 కూడా ఆయనకి సరిపోలేదు. టిడిపి నుండి నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడని, అందరూ ఆయన కేంద్రం మెడలు వంచుతాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు, ప్రజల జీవితాలు మారిపోతాయి అని అనుకున్నారని, కానీ అలాంటిదేమీ జరగలేదని.. ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని నారా లోకేష్ చెప్పారు.
ఈ నాలుగున్నరేళ్లో రాష్ట్రంలో ఒక్క రోడ్డు వెయ్యలేదని, ఒక్క సాగునీటి ప్రాజెక్టు కట్టలేదని, ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేదని ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా జలాల పై మన రాష్ట్రం హక్కు కోల్పోతుంటే పట్టించుకోవడం లేదన్నారు. సైకో జగన్ కక్ష సాధింపు మాత్రమే ఎజెండా గా పెట్టుకొని పనిచేస్తున్నాడని, దీనివల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని కూడా ప్రజలకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు.