ఈ సందర్భంగా చైర్ పర్సన్ పద్మశ్రీ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించే ధాన్యంను అమ్ముకునే సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 6 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చని అంచనా ఉందని, అందుకు తగిన విధంగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలులో రైతు భరోసా కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద తేమ, నూకల శాతం లెక్కింపులో వ్యత్యాసం ఉంటున్నదని, చిరిగిపోయిన గోనెసంచుల అందిస్తున్నారని, అదేవిధంగా రవాణాకు వాహనాల ఏర్పాటులో కూడా ఫిర్యాదులు వస్తున్నాయని, వీటన్నింటినీ అధిగమించి రైతులు రైస్ మిల్లర్ల నుండి ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా కస్టోడియన్ అధికారులు మరింత బాధ్యతతో పనిచేసి విధంగా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మంజుభార్గవిని జెడ్పి చైర్ పర్సన్ ఆదేశించారు.
ప్రతీ మండలంలోనూ మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాలు ఏర్పాటుచేసి, రైతుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖాధికారులను చైర్ పర్సన్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విధానం అంతా ఆన్లైన్ లో నిర్వహిస్తున్నప్పటికీ, అధికారులు ముందుగానే క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కార విధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత సీజన్లో వర్షాభావ పరిస్థితులు కారణంగా పెదపాడు, కైకలూరు, తదితర మండలాలకు చెందిన శివారు భూములకు కృష్ణా కాలువ నుండి సాగు, త్రాగునీరు సక్రమంగా అందడం లేదని, వంతులవారీ విధానాన్ని సక్రమంగా ప్రణాళికాబద్దంగా అమలు చేయాలనీ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో త్రాగునీటి ఎటువంటి కొరతా లేకుండా చర్యలు తీసుకోవాలని, జల్ జీవన్ మిషన్ లో ప్రతీ ఇంటికి మంచినీటి కుళాయి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాలలో త్రాగునీరు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమలును సమీక్షించేందుకుగాను ఐ టి డి ఏ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని పద్మశ్రీ తెలియజేసారు. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను అమలులో జెడ్పిటిసి., ఎంపిపి వంటి ప్రజాప్రనిధులకు కూడా సమాచారం అందిస్తూ వారిని సమన్వయము చేసుకుని పధకాల అమలును మరింత వేగవంతం చేయాలన్నారు.
కుక్కునూరు, వేలేరుపాడు పరిసర ప్రాంతాలలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు కొంతమంది ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చారని, దీనిపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పించాలని గనుల శాఖ డిడి ని చైర్ పర్సన్ ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ప్రజల నుండి మంచి స్పందన వస్తున్నదని, పాఠశాలల్లోని విద్యార్థులకు కూడా నూరుశాతం ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను చైర్ పర్సన్ ఆదేశించారు.
జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో కంటి పరీక్షలు నిర్వహించిన వారికి కళ్ళద్దాలు అందించడంలేదని కొంత మంది సభ్యులు తెలియజేయగా, వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శర్మిష్ట ను ఆదేశించారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలనుండి వివిధ ఆరోగ్య సమస్యలపై జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులను ఏలూరు ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారని సభ్యులు చైర్ పర్సన్ దృష్టికి తీసుకురాగా, ఎంతో దూరం నుండి వ్యయప్రయాసలకోర్చి వచ్చే ప్రజలను అత్యవసర పరిస్థితిలో తప్ప ఏలూరు ఆసుపత్రికి రిఫర్ చేయకుండా మెరుగైన వైద్య సేవలందించాలని వైద్య అధికారులను ఆదేశించారు.