Hot Posts

6/recent/ticker-posts

కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలు స్థాపనపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్


అంబేద్కర్ జిల్లా, అమలాపురం: కోనసీమ జిల్లాలో కొబ్బరి విలువ ఆధారిత సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాల గ్రౌoడిoగ్ కొరకు జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీలో ప్రధాన అజెండా అంశంగా చేర్చి పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషిచేస్తూ సుస్థిర జీవనోపాదులు పెంపుదలకు చర్యలు గైకొనడం జరుగుతుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశపు హాలు నందు కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలు స్థాపనపై అవగాహన కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనసీమ జిల్లా పూర్తి వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా కొబ్బరిసాగుతో విరాజిల్లుతోందని, ప్రధానమంత్రి  సూచనలకు అనుగుణంగా జిల్లాలో కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల స్థాపన ద్వారా ఒకే జిల్లా- ఒకే ఉత్పత్తి కార్యక్రమానికి నాంది పలికి ఉద్యాన అనుబంధం శాఖలు పరిశ్రమలు విభాగాలు ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. 


కొబ్బరి ఉత్పత్తులకు విలువను జోడించడం ద్వారా ఉత్పాదకతను, లాభదాయకతను పెంపొందించడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు. రైతులు అన్ని సంబంధిత విభాగాలను కలపడం ద్వారా కొబ్బరి విలువ ఆధారితంపై ఒకే జిల్లా - ఒక ఉత్పత్తి కార్యక్రమంపై రైతులు, పరిశోధకులు, విక్రయదారులతో పరస్పర చర్యకు వేదికను అందించడంతో పాటుగా జ్ఞానాన్ని పెంచడానికి ఆసక్తిగల వ్యాపార వేత్తలు, రైతులకు గరిష్ట సహాయాన్ని అందించడానికి అన్ని సంబంధిత శాఖల పథకాలతో కలిసే అవకాశాలను అందించాలని సూచించారు. పుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రేరణ కొరకు ఊతం ఇవ్వడంతో పాటుగా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పనకు దోహదపడుతుందన్నారు. 


ఒకే జిల్లా- ఒకే ఉత్పత్తి చొరవతో సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని పెంపొందించడానికి  ప్రతి జిల్లా నుండి ఒక ఉత్పత్తిని ఎంపిక చేసుకోవడం, బ్రాండ్ చేయడం, అన్ని ప్రాంతాలలో సంపూర్ణ సామాజిక ఆర్థిక వృద్ధిని సాధించాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడేలా స్థానిక ఉత్పత్తులు అత్యంత నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానికంగా కొబ్బరి కల్పతరువుగా పేరు పొందిందని అధికారులు పూర్తి సమన్వయంతో కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తుల యూనిట్లో నెలకొల్పేందుకు పూర్తి సమన్వయం వహించాలన్నారు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ కొబ్బరి బర్ఫీ, లడ్డు, బిస్కెట్ చిప్స్,తదితర ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల విభాగం అధికారులు నాబార్డ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఎల్డిఎం సమన్వయంతో యూనిట్ల గ్రౌండింగ్ కు ముందుకు రావాలన్నారు. ఔత్సా హిక కొబ్బరి విలువ ఆదారిత ఉత్పత్తిదారులకు అన్ని విధాలుగా చేయూతనందించి జీవనోపాదులు పెంపొందించే దిశగా చర్యలు వేగవంతం చేయాలన్నారు. 


కన్వర్జెన్సీ విధానంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, మధ్యతరహా యూనిట్ల నెలకొల్పుకొని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. మహిళా శక్తి సంఘాల ద్వారా గ్రామీణ కుటీర పరిశ్రమలు నిలద్రోక్కుకునే విధంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ దిశగా అధికారులు ప్రోత్సాహం అందించాలన్నారు. ప్రతి ఉత్పత్తిదారుడు రిస్క్ బేరింగ్ కెపాసిటీని కలిగి ఉన్నప్పుడే యూనిట్లు ద్వారా సుస్థిర జీవనోపాదులు పొందే అవకాశాలు మెండుగా ఉంటాయన్నా రు. ప్రతి నెల కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలపై సమావేశాలు నిర్వహించి యూనిట్ల స్థాపనపై సమీక్షించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అత్యంత డిమాండ్ ఉన్న కొబ్బరి పాల ఉత్పత్తులపై దృష్టిసారించి గ్రామాలలో ముందుగా కొబ్బరిపాలు తీసే యూనిట్లను నెలకొల్పే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటిగ్రేటెడ్ ప్రోడక్ట్ పరిశ్రమల స్థాపన కొరకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. 


యూనిట్లు స్థాపనకు ముందుకు వచ్చే ఉత్పత్తుదారులు రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అధికారులు అన్ని విధాలుగా ఆర్థిక చేయూత మరియు యూనిట్లు నెలకొల్పేందుకు అవసరమైన సాంకేతిక, సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఒకటి, రెండు భారీపరిశ్రమ ద్వారా వర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారీపై చర్యలు గైకొనడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. 


ఈ కార్యక్రమంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు డిప్యూటీ డైరెక్టర్ కుమార్ వెల్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ప్రసాద్, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం అధికారి మారుతి, డి ఆర్ డి ఏ పి డి శివశంకర్ ప్రసాద్, ఎల్డిఎం ప్రసాద్, జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ ప్రతినిధులు రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు ఏపీ రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ సభ్యులు జిన్నూరి రామారావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మోటూరి సాయి, జిల్లా ఉద్యాన అధికారి డి వి రమణ తదితరులు పాల్గొన్నారు.