WARANGAL: ప్రతి రేషన్ డీలర్ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడి సన్న బియ్యం ఇవ్వాలన్నారు. రేషన్ సరుకుల్లో అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయటంతో పాటుగా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. శనివారం వరంగల్ జిల్లా దేశాయిపేటలో రేషన్ కార్డు లబ్ధిదారు సోల రేణుక ఇంట్లో ఆమె భోజనం చేశారు. జిల్లా కలెక్టర్ డా.సత్యశారద, మున్సిపల్ కమిషనర్ డా.అశ్విని తానాజీతో కలిసి భోజనం చేశారు. అనంతరం మాట్లాడిన ఆమె.. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయని చెప్పారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని సురేఖ తెలిపారు. గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలను పట్టించుకోలేదని విమర్శించారు. గతంలో మిల్లర్లతో కలిసి దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి వసతి గృహాలకు ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. రేషన్ డీలర్లు కల్తీ బియ్యాన్ని ప్రజలకు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీలర్లు అక్రమాలకు పాల్పడితే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ డా.సత్యశారదను మంత్రి ఆదేశించారు. లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలున్నా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
కాగా, తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీని ఉగాది కానుకగా ప్రారంభించింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్‌నగర్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఏప్రిల్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది. రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలలోని ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడం, వారు బయట సన్న బియ్యం కొనుక్కోవడానికి పెట్టే అదనపు ఖర్చును తగ్గించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
పథకానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు సన్న బియ్యం కోసం క్యూ కడుతున్నారు. పౌర సరఫరాల శాఖ అన్ని జిల్లాల్లోని చౌక ధరల దుకాణాలకు సన్న బియ్యం చేరవేసింది. కొన్ని ప్రాంతాల్లో సరఫరాలో స్వల్ప ఆలస్యం ఉన్నప్పటికీ, క్రమంగా అందరికీ అందుతోంది. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.