ఏలూరు: ప్రజల నుంచి రెవిన్యూ సంబంధిత అర్జీలను తక్షణమే నాణ్యతతో పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. రాష్ట్ర సచివాలయం నుంచి పిజిఆర్ఎస్(రెవిన్యూ), రెవిన్యూ సదస్సులు, రీ సర్వే, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో భూ పరిపాలన ప్రధాన కమీషనరు జి. జయలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లాలో రెవిన్యూ అంశాలకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం, ఇళ్ల స్ధలాలు, మ్యూటేషన్స్ తదితర అర్జీల పరిష్కార తీరును కలెక్టర్ వివరించారు. అర్జీలు అందిన వెంటనే వాటిని పరిశీలించి అర్జీదారుని సంతృప్తి చెందేలా పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఇంతవరకు 479 గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహించి 4,831 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. వీటిలో ఇప్పటికే 1793 అర్జీలు పరిష్కరించబడ్డాయన్నారు.
ఈ సందర్బంగా సిసిఎల్ఏ కమిషనర్ జయలక్ష్మి మాట్లాడుతూ రెవిన్యూ సదస్సులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సదస్సులు ముగిసేవరకు ఇదే స్పూర్తితో ముందుకు సాగాలన్నారు. ఎళ్ల తరబడి అపరిషృతంగా ఉన్న భూములు సమస్యలను పరిష్కరించడమే రెవిన్యూ సదస్సుల ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. భూ సమస్యల పరిష్కారంలో ప్రజల సంతృప్తిస్ధాయి మెరుగ్గా ఉండేలా తహశీల్ధార్లు పనిచేయాలన్నారు. నిషేదిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలను పునః పరిశీలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. జనవరి మొదటి వారంలోగో ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రీ సర్వే అధనపు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ రీ సర్వేపై క్షేత్రస్ధాయిలో పనిచేసే రెవిన్యూ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.