ఏపీ అప్పుల కుప్పగా మారిందని.. దీనిని సరిచేసేందుకు కొన్ని దశాబ్దాల కాలం పడుతుందని ప్రస్తుత సీఎం చంద్రబాబు చెప్పారు. తాజాగా అసెంబ్లీలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబా బు రాష్ట్రంలో ఉన్న అప్పులను వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9.74 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. దీనినిసరిదిద్ది.. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాల్సి ఉందన్నారు. అయితే.. ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు ఉన్నాయని చంద్రబాబు సహా కూటమి పార్టీలు చెప్పాయి.
కానీ, ఇప్పుడు అదే తప్పును 5 లక్షల కోట్లకు తగ్గించి.. 9.74 లక్షల కోట్లుగా చూపించారు. మరోవైపు.. తమ హయాంలో వాస్తవ అప్పు 5.18 లక్షల కోట్లేనని.. ఇతర కార్పొరేషన్లు.. మిగిలిన సంస్థల నుంచి తీసుకున్న అప్పులు కలిపితే.. 7.14 లక్షల కోట్ల కు మించదని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఒకవైపు ఆర్థిక శాఖపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తున్న సమయంలోనే ఆయన మీడియా ప్రతినిధులతో మీటింగ్ పెట్టి వివరాలు వెల్లడించారు.
ఇలా చూసుకున్నా.. 1.40 లక్షల కోట్ల వరకు తేడా ఉంది. మరి దీనిలో ఏది నిజం? ఎవరు చెబుతున్నది వాస్తవం..? అనేది ఆసక్తిగా మారింది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చెప్పిన లెక్కలను చూస్తే.. ఇటీవల బడ్జెట్ ప్రకటించిన మర్నాడే నిర్మలా సీతారామన్.. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఏపీ అప్పులు 4.52 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పారు. ఇక, దీనికి ముందు.. ఆర్బీఐ కేంద్రానికి ఇచ్చిన నివేదికలో కూడా 4.52 లక్షల కోట్లు అప్పులు చూపించింది.