గడచిన పదేళ్లలో ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారం ఆవహించింది..
రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ రావాలి...
జిల్లా స్థానికురాలిగా మీ ముందుకు వస్తున్నా ..
నన్ను ఆశీర్వదించి చట్టసభలకు పంపించండి....
ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కావూరి లావణ్య
దెందులూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇద్దరికీ పదవి వ్యామోహం తప్ప ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యం ఏమాత్రం లేదని ఏలూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావూరి లావణ్య విమర్శించారు. గురువారం దెందులూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆమె రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా కావూరి లావణ్య మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని, కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు.
దెందులూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో ద్వారా హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకొని, రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపై మొదటి సంతకం ఉండబోతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్దే నేటికీ కనిపిస్తుందే తప్ప టిడిపి, వైసిపిలు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. టిడిపికి ఓటు వేసిన, వైసిపికి ఓటు వేసిన నరేంద్ర మోడీకి వేసినట్టే అన్నారు.
ఇద్దరు పార్టీ అధినేతలపై ఉన్న కేసులకు భయపడి రాష్ట్రానికి కావలసిన రావలసిన నిధులు నియామకాలను ప్రశ్నించే ధైర్యం ఇక్కడి ఎంపీలు గత పది సంవత్సరాలుగా చేయడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జరుగుతున్న అన్యాయలకు సంబంధించిన విషయాలనుకానీ, మహిళాలపై జరుగుతున్న దాడులపై కానీ ఏ రోజైనా ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిపెస్టోలో ప్రతి పేద మహిళాకు సంవత్సరానికి లక్ష రూపాయలు అకౌంట్ లో వేయడం జరుగుతుందని, రైతులకు సంబంధించిన 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందని, వంట గ్యాస్ సిలిండర్ కేవలం 500 రూపాయలకే ఇస్తామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సాగు, త్రాగు ప్రాజెక్టులు పూర్తి చేసింది తప్ప వీరు చేసిందేమీ లేదన్నారు. తాను ఉన్నత చదువులు చదివి సమాజ సేవ చేయాలనే దృక్పథంతో కావూరి కుటుంబం నుండి వచ్చానని ఆదరించి గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మీ ఇంటి బిడ్డగా, మీ ఆడపడుచుగా ప్రతి కుటుంబానికి తోడుగా ఉంటానని కావూరి లావణ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Staff Reporter
Akhil Babji Shaik
Eluru