వనదుర్గాదేవి ప్రత్యేక అలంకరణలో శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారు దర్శనం
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: పట్టణ ఇలవేల్పు దేవత శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారు ఆషాడ అమావాస్యను పురస్కరించుకుని వనదుర్గాదేవి ప్రత్యేక అలంకరణలో భక్తులకు జులై 17, సోమవారం దర్శనమివ్వనున్నారని ఆలయ కమిటీ ఛైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ(పండు)తెలిపారు.
ప్రకృతి స్వరూపమైన అమ్మవారిని వనాలలో లభించే విశేష పత్రులతో కూడిన అలంకరణ చేయనున్నామని, వేప, మామిడి, రావి, జువ్వి, నేరేడు, మర్రి ఇలా అనేక పత్రులను సేకరించి అమ్మవారిని ప్రత్యేకంగా ఆలయ ప్రధానార్చకులు యర్రమిల్లి మనోజ్ శర్మ ఆధ్వర్యంలో అలంకరించి భక్తులకు దర్శనం అందించేందుకు ఆలయకమిటీ కృషి చేస్తుందని, భక్తులు అమ్మవారిని దర్శించి తరించాలని డాక్టర్ రాజాన సత్యనారాయణ(పండు) ఆహ్వానం పలికారు.
కాగా 2018లో ఈ టీవీలో ప్రసిద్ధ నేపధ్య గాయకులు ఎస్ పీ బాల సుబ్రహ్మణ్యం నిర్వహణలో జరిగిన పాడుతాతీయగా విజేతగా నిలిచిన నర్సిపట్నంకు చెందిన దొంతంశెట్టి రాజేష్, రాణి దంపతుల కుమారుడు దొతంశెట్టి ధీరజ్ స్థానిక శ్రీనూకాంబికా అంజనీసాయి స్వచ్చందసేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మహంకాళి రాజా మార్గనిర్దేశకత్వంలో జంగారెడ్డిగూడెం విచ్చేసి శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారిని దర్శించి గళార్చన నిర్వహించి భక్తిపాటలు, శ్లోకాలు ఆలపించారు.
ధీరజ్ 2022 మా టీవీ సూపర్ సింగర్ పోటీలలో జూనియర్ విభాగంలో ఫైనలిస్ట్ గా నిలవడంతో పాటు ఎస్ వీ బీ సీ చానెల్ లో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో మూడు పాటలను అలపించి ప్రముఖుల ప్రశంసలు పొందినట్టు డాక్టర్ రాజాన తెలిపారు. ధీరజ్ మరియు తండ్రి రాజేష్ లకు అమ్మవారి రూపకపటాన్ని, శేషవస్త్ర ప్రసాదాలు రాజన సారథ్యంలో ఆలయ కమిటీ అందజేశారు.
నూకాలమ్మ అమ్మవారి దర్శనం ఎంతో ఆధ్యాత్మిక దివ్యానుభూతిని అందించిందని దొంతంశెట్టి రాజేష్ అన్నారు. అధ్యాత్మికవేత్త కనుపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ వనదుర్గా అలంకరణ విశిష్టతను వివరించారు. కాగా ఆదివారం కావడం, ఆషాఢమాసంలో చివరి ఆదివారం పురస్కరించుకుని భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకుని నైవేద్యాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో కారింగుల రామక్రిష్ణ, రొంగల నాగేశ్వరావు, చిట్లూరి సర్వేశ్వరరావు చింతకాయల అచ్చిరాజు, రొంగల సత్యనారయణ మహిళలు, మరియు గ్రామ భక్త మహా జనులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఆలయ కమిటీ మేనేజర్ చిటికెన రాంబాబు తెలిపారు.