బెటర్ అండ్ సింపుల్ గా నూతన జీఎస్టీ..
ఆనందోత్సాహంలో అన్నదాతలు..
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్ల: కొత్తపేట మండలంలో నూతన జీఎస్టీ సూపర్ సేవింగ్స్, జీఎస్టీ బెటర్ అండ్ సింపుల్ తో రైతాంగానికి పలు ప్రయోజనాలు కలగనున్నాయని, జీఎస్టీ తగ్గింపు ద్వారా రైతాంగానికి ఉపయోగపడే ట్రాక్టర్లు, యంత్ర సామగ్రి, స్పేర్ పార్టులు అందుబాటులో ధరల్లో లభిస్తున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం రైతులు జీఎస్టీ 2.0 పై ఆనందం వ్యక్తం చేస్తూ గోపాలపురం నుంచి రావులపాలెం వరకూ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.
రావులపాలెంలో ఆ ర్యాలీ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీఎస్టీ 2.0తో రైతులకు మేలు జరుగుతుందన్నారు. గతంలో ట్రాక్టర్ల కొనుగోలుపై 12శాతం టాక్స్ ఉండేదని, ఇప్పుడు అది 5శాతానికి తగ్గిందన్నారు. దీనితో ఒక్కొక్క ట్రాక్టర్ పై రూ.48వేల వరకూ ధర తగ్గుతుందని తెలియజేశారు. నాలుగేళ్లలో ట్రాక్టర్ స్పేర్ పార్టులు, సర్వీస్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తగ్గిన జీఎస్టీని లెక్క వేసుకుంటే రూ.70,570 వరకూ ఒక్కొక్క ట్రాక్టర్ కొనుగోలుపై ఆదా అవుతుందన్నారు.
ట్రాక్టర్ విడి భాగాల మీద గతంలో 18శాతం టాక్స్ ఉండేదని ఇప్పుడు అది 5శాతానికి తగ్గిందన్నారు. అంటే నూటికి 13 రూపాయలు టాక్స్ రూపంలో తగ్గుతుందన్నారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాల మీద గతంలో 12శాతం ట్యాక్స్ ఉంటే ప్రస్తుతం అది 5శాతానికి తగ్గిందన్నారు. దీనితో ఏడాదికి ఎకరానికి రూ.5వేల వరకూ డ్రిప్ ఇరిగేషన్ రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. పవర్ టిల్లర్లు మీద 12శాతం ఉన్న టాక్స్ 5శాతానికి, డ్రోన్ల మీద 18శాతం ఉన్న ట్యాక్స్ 5శాతానికి తగ్గిందన్నారు. దీనితో ఒక్కో డ్రోన్ ధరపై రూ.61,250 వరకూ ట్యాక్స్ తగ్గిందన్నారు. వరికోత యంత్రాలపై రూ.1.24లక్షల నుంచి రూ.5.90లక్షల వరకూ లబ్ధి కలగనుందని తెలిపారు.
ఒక్కో పవర్ టిల్లర్ పై రూ. 7800 నుంచి రూ.16వేల వరకూ ధర తగ్గిందని, బ్యాటరీ స్పేర్ల మీద రూ.250 నుంచి రూ.600 వరకూ ధర తగ్గుతుందన్నారు. ఆక్వా కల్చర్ పరికరాలు, బయో ఎరువులు, వ్యవసాయ పరికరాలపై గతంలో 12శాతం ఉన్న ట్యాక్స్ ఇప్పుడు 5శాతానికి తగ్గిందని వివరించారు. గతంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన పరికరాలపై 18శాతం,12శాతం ఉన్న ట్యాక్స్ ఇప్పుడు 5శాతానికి దిగివచ్చిందన్నారు. దీనితో రైతులకు పెట్టుబడులు తగ్గుతాయని తెలియజేశారు. రైతులంతా ఈ అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.