Hot Posts

6/recent/ticker-posts

జైల్లో మొబైల్ తో పట్టుబడితే భారీ శిక్ష.. కేంద్రం కొత్త ప్రతిపాదన..


 నిబంధనలకు విరుద్ధంగా జైల్లో మొబైల్ ఫోన్ వాడుతూ పట్టుబడిన ఖైదీలకు మూడేళ్లు జైలుశిక్ష విధించేలా కేంద్రం ఒక ప్రతిపాదన చేసింది. 


కొత్త చట్టాలను తీసుకొచ్చే విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోంది. ఓవైపు కాలం చెల్లిన.. బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త శిక్షలతో చట్టాన్ని మరింత కరకుగా మార్చాలన్న ప్రయత్నం జరుగుతోంది. దీనికి సంబంధించి పలు నిర్ణయాల్ని కేంద్రం తీసుకుంటూ.. వాటి మీద తమ అభిప్రాయాల్ని తెలపాల్సిందిగా కోరుతూ రాష్ట్రాలకు సమాచారాన్ని పంపుతోంది. 


తాజాగా అలాంటిదే ఒక అంశంపై కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా జైల్లో మొబైల్ ఫోన్ వాడుతూ పట్టుబడిన ఖైదీలకు మూడేళ్లు జైలుశిక్ష విధించేలా కేంద్రం ఒక ప్రతిపాదన చేసింది. ఖైదీలు.. సందర్శకులు.. అధికారులు ఎవరైనా సరే మొబైల్ ఫోన్లు.. ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వాడినట్లుగా గుర్తిస్తే కఠిన శిక్షలు విధించేలాప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. 


నిషేధిత వస్తువుల్ని అధీనంలో ఉంచుకున్నా.. ఉపయోగించినా.. జైల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా.. లేదంటే ఉన్న వాటిని తొలగించే ప్రయత్నం చేసినా.. తోటి ఖైదీలకు సరఫరా చేసేందుకు ప్రయత్నించినా శిక్షించేలా ప్రతిపాదనను సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన నమూనాను రాష్ట్రాలకు పంపింది. మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్ం 2023ను తాజాగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం పంపింది.1894, 1900 నాటి నుంచి అమల్లో ఉన్న చట్టాల్ని మారిన కాలానికి తగ్గట్లు కొత్తనమూనా చట్టాన్ని రూపొందించేందుకు వీలుగా కేంద్రం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు కొత్త అంశాల్ని చేరుస్తున్నారు. కొత్తగా సిద్ధం చేసిన నమూనా చట్టంలో మొత్తం 21 అధ్యాయాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. 


జైల్లోని ఖైదీలకు సంబంధించి పలు అంశాల్ని నమూనా చట్టంలో వివరంగా పేర్కొన్నారు. ఖైదీలు అందరిని ఒకే గాటున కట్టేయకుండా ఏడు రకాలుగా విభజించారు. 1. సివిల్ ఖైదీలు 2. క్రిమినల్ ఖైదీలు 3. శిక్ష పడిన ఖైదీలు 4. అండర్ ట్రయల్స్ 5. నిర్బంధంలో తీసుకున్న వారు 6. అదే పనిగా అలవాటుగా నేరాలు చేసేవారు 7. తరచూ జైలుకు వచ్చే ఖైదీలు ఇలా ఖైదీల్ని వేర్వేరుగా వర్గీకరించటంతో పాటు.. విభాగాల వారీగా ప్రత్యేక బ్యారక్ లు.. ఎన్ క్లోజర్లు.. సెల్స్ ఉంచాలన్న ప్రతిపాదన చేశారు. ఖైదీల్లోనూ పురుషులు.. స్త్రీలు.. ట్రాన్స్ జెండర్స్ గా వర్గీకరించటంతో పాటు మరికొన్ని విభాగాల్ని కూడా ప్రతిపాదనలోకి తీసుకొచ్చారు. అందులో.. 


ఖైదీల్లో డ్రగ్స్ కు అలవాటు పడిన వారు - మద్యం మత్తులో నేరం చేసినోళ్లు - తొలిసారి నేరం చేసినోళ్లు - నేరాలు చేసిన విదేశీయులు - 65 ఏళ్లకు పైబడిన వారు - ఇన్ ఫెక్షన్.. దీర్ఘకాల వ్యాధులతో బాధ పడుతున్నవారు - మానసిక ఆరోగ్యంతో సతమతమవుతున్న వారు - మరణశిక్ష పడ్డవారు - ఎక్కువ ప్రమాదం ఉన్న వారు - పిల్లలతో ఉన్న మహిళలు - యువ ఖైదీలను వేర్వేరుగా ఉంచాలన్న ప్రతిపాదన చేస్తున్నారు. 


అంతేకాదు.. ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ పరికరాల్ని ధరించటానికి అంగీకరించిన వారికి సెలవు ఇవ్వొచ్చని.. ఇలాంటి వారు ధరించిన ఎలక్ట్రానిక్ పరికరాల్ని.. పర్యవేక్షించాలని.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వెంటనే వారికి సెలవు రద్దు చేయాలన్న సూచన చేశారు. వారికిచ్చే భవిష్యత్తు సెలవుల్ని సైతం రద్దు చేయాలని ప్రతిపాదించారు. వీటితో పాటు జైల్లో నేరాలుగా పరిగణించే అంశాల్ని సైతం సవివరంగా పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిపైనా రాష్ట్రాలు అధ్యయనం చేసి తమ అభిప్రాయాల్ని కేంద్రానికి వెల్లడించాల్సి ఉంటుంది.