ఏలూరు, పశ్చిమ వాహిని, మే 6: “మత్తు రహిత సమాజమే లక్ష్యం” అనే నినాదంతో ఏలూరు జిల్లా పోలీస్ శాఖ గంజాయి వినియోగం మరియు అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు కైకలూరు రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో గంజాయి వినియోగదారులు మరియు పాత నేరస్తులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో కైకలూరు రూరల్ ఇన్‌స్పెక్టర్ వి. రవి కుమార్, కైకలూరు రూరల్ ఎస్ఐ రాంబాబు, మండవల్లి ఎస్ఐ రామచంద్రరావు కలిసి అనుమానితులను గుర్తించి ప్రత్యేక కిట్ల ద్వారా గంజాయి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిపై కూడా పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.
యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పరీక్షల్లో గంజాయి వినియోగం పాజిటివ్‌గా తేలిన వ్యక్తులపై కేవలం కేసులు నమోదు చేయడమే కాకుండా, వారిలో మార్పు తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. అలాంటి వారిని డీ-అడిక్షన్ సెంటర్లకు పంపించి వైద్య చికిత్సతో పాటు మానసిక కౌన్సెలింగ్ అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
గంజాయి విక్రయాలు మరియు రవాణాలో పాల్గొనే పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు హెచ్చరించారు. మళ్లీ నేరాలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో గంజాయి విక్రయాలు లేదా వినియోగం గుర్తించిన వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కైకలూరు రూరల్ సర్కిల్‌ను గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు మరియు పునరావాస కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.


