ఎన్‌టీఆర్ జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 10: ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ నెల 18న జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ భావితరాలకు అందించాలనే లక్ష్యంతో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని మీడియా సమావేశంలో వెల్లడించారు. వారసత్వ పరిరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధికి ఈ కార్యక్రమాలు దోహదం చేస్తాయని అన్నారు.
జిల్లాలోని ప్రముఖ వారసత్వ ప్రదేశాలు ఈ వేడుకలకు కేంద్రంగా మారనున్నాయి. కనకదుర్గమ్మ ఆలయం, మొగల్రాజపురం గుహలు, అక్కన్న మాదన్న గుహలు, గాంధీ కొండ, కొండపల్లి ఖిల్లా వంటి చారిత్రక ప్రదేశాలను సంరక్షించడం అత్యంత అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వారసత్వ సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిదని పిలుపునిచ్చారు.
ఈ నెల 18న ఉదయం 6 గంటలకు కొండపల్లి ఖిల్లా వద్ద హెరిటేజ్ ట్రెక్కింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అదేవిధంగా ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH) భాగస్వామ్యంతో నగరంలో హెరిటేజ్ వాక్ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలు యువతలో వారసత్వంపై అవగాహన పెంచేలా ఉంటాయని అధికారులు తెలిపారు.
కొండపల్లిలో మూడు రోజుల పాటు కొండపల్లి బొమ్మల మేళా నిర్వహించనున్నారు. స్థానిక హస్తకళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా నిర్వహించిన బొమ్మల పోటీల్లో విజేతలకు రూ.లక్ష విలువైన బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా 18వ తేదీ రాత్రి సంగీత ఝరి కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రముఖ గాయకులు ఎస్‌పీ చరణ్, సునీత పాల్గొని సంగీత కార్యక్రమాన్ని అలరించనున్నారు. వారసత్వాన్ని ప్రతిబింబించే కళాకారులను సత్కరించే కార్యక్రమం కూడా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాలను ప్రతి సంవత్సరం నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.


