ఎన్‌టీఆర్ జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 10: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), నేవల్ అకాడమీ (ఎన్‌ఏ), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్షల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా అభ్యర్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో సమన్వయం కీలకమని స్పష్టం చేశారు.
విజయవాడలోని ఏడు కేంద్రాల్లో ఈ నెల 12న పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 2,800 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. సీడీఎస్ పరీక్షకు 699 మంది, ఎన్‌డీఏ & ఎన్‌ఏ పరీక్షలకు 2,101 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
సీడీఎస్ పరీక్ష మూడు సెషన్లలో జరుగనుంది. ఉదయం 9 నుండి 11 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు రెండో సెషన్, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు మూడో సెషన్ నిర్వహిస్తారు. అలాగే ఎన్‌డీఏ & ఎన్‌ఏ పరీక్షలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:30 వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.
పరీక్షల సందర్భంగా భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు సూచించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు. అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, వేసవి దృష్ట్యా తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో స్టేట్ అబ్జర్వర్ ప్రేమ్ కుమార్ లకావత్, యూపీఎస్సీ ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్ సుమిత్ వర్మ, డీఆర్‌వో ఎం. లక్ష్మీనరసింహం, ఆర్డీవో టీవీ సతీష్ తదితరులు పాల్గొన్నారు.


